అణు వ్యవహారంలో వెనక్కి తగ్గేదే లేదు.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక!
సూర్య అంతర్జాతీయ డెస్క్: తమ అణు కార్యక్రమంపై అమెరికాతో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే ప్రతిపాదనకు అమెరికా అంగీకరించినప్పటికీ, తమ అణు హక్కులు మరియు యురేనియం శుద్ధి విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అమెరికా తమ నౌకాశ్రయాలపై విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేసి, తమ రవాణా మార్గాలను పునరుద్ధరించే వరకు హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని, తమ షరతులన్నీ నిరభ్యంతరంగా నెరవేరితే తప్ప ఈ మార్గాన్ని తెరవబోమని హెచ్చరించారు.
ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒక సంచలన ప్రతిపాదనను ముందస్తుగా ఉంచారు. ఆ ప్రతిపాదన ప్రకారం.. అమెరికా తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని తొలగించి, స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడంతో పాటు చమురు ఆంక్షలను సడలిస్తే, ఏడు రోజుల్లో లెబనాన్‌తో సహా అన్ని సరిహద్దుల్లోనూ యుద్దాన్ని నిలిపివేసి హోర్ముజ్ జలసంధిని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. అయితే, అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత ప్రాధాన్యమైన ఈ జలసంధిని తెరవడానికి అమెరికా సానుకూలంగా ఉన్నప్పటికీ, తమ ప్రధాన డిమాండ్ అయిన యురేనియం శుద్ధిని నిలిపివేయడం లేదా శుద్ధి చేసిన నిల్వలను విదేశాలకు తరలించడం వంటి అంశాలపై ఇరాన్ ఏమాత్రం ఒప్పుకోవడం లేదు.
గత ఏడు నెలలుగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పౌర అవసరాల కంటే అత్యధికంగా 60 శాతానికి పైగా యురేనియం శుద్ధి చేస్తూ ఇరాన్ అణు ఆయుధ తయారీకి యత్నిస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తుండగా, తమది కేవలం శాంతియుతమైన అణు కార్యక్రమమేనని ఇరాన్ స్పష్టం చేస్తోంది. నవంబర్‌లో జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, అణు సడలింపులపై ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో ఈ దౌత్య చర్చలు ఎటువైపు దారితీస్తాయోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.