మైనర్ వేధింపుల కేసులో వయోలిన్ విద్వాంసుడు అరెస్ట్: బాధితులు ధైర్యంగా ముందుకు రావాలన్న సింగర్ చిన్మయి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కర్ణాటక సంగీత రంగంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు హెచ్.ఎన్. భాస్కర్ అమెరికాలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వరుస పోస్టులతో స్పందిస్తూ సంగీత ప్రపంచంలోని చీకటి కోణాలను బహిర్గతం చేశారు. కర్ణాటక సంగీతం మరియు శాస్త్రీయ నృత్య రంగాలు చాలా చిన్న వలయాలని, అక్కడ అందరికీ అందరూ తెలుసు కాబట్టి ఎవరైనా నోరు విప్పితే వారి కెరీర్ పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ కంటే శాస్త్రీయ సంగీత రంగంలోనే వేధింపుల తీవ్రత ఎక్కువగా ఉందంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భాస్కర్ అరెస్టు వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తనకు అనేక మంది బాధితుల నుంచి సందేశాలు వస్తున్నాయని చిన్మయి వెల్లడించారు. సదరు వయోలిన్ విద్వాంసుడిపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని, అయితే ఆయనతో కలిసి పనిచేసే మహిళా కళాకారులతో సహా కర్ణాటక సంగీత రంగానికి చెందిన వారెవరూ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధితులు చాలా చిన్న వయసు వారని, ఈ కేసుల్లో కొన్ని పోక్సో చట్టం పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. బాధితుల అనుమతి లేకుండా వారి కథనాలను గానీ, స్క్రీన్‌షాట్లను గానీ తాను బహిర్గతం చేయలేనని చిన్మయి స్పష్టత ఇచ్చారు.
లైంగిక వేధింపులకు గురైన బాధితులంతా భయాన్ని వీడి ఐక్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిన్మయి పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ఆమె, సానుభూతితో మరియు సున్నితంగా వ్యవహరించే న్యాయవాదుల ద్వారా తగిన న్యాయసహాయం అందేలా తాను బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ధైర్యం చేసి తమ చేదు అనుభవాలను బయటపెట్టిన బాధితులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్మయి, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఈ న్యాయపోరాటం కొనసాగాలని ఆకాంక్షించారు.
కాగా, మైసూరుకు చెందిన హెచ్.ఎన్. భాస్కర్ సెప్టెంబర్ నెలలో అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో అమెరికా పోలీసులు ఆయనను బోస్టన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా, ప్రముఖ గాయకుడు టీఎం కృష్ణ సహా పలువురు సంగీత కళాకారులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. .
Also Read: మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్: ప్రభుదేవా దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'వీఎం 24' ప్రకటన