శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా
'ఒకే ఒక జీవితం' చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ తదుపరి ప్రాజెక్ట్‌లో ప్రముఖ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా ఎంపికయ్యారు. ఈ ఇంకా పేరు పెట్టని రోడ్-ట్రిప్ అడ్వెంచరస్ చిత్రంలో ఆమె 'తార' అనే ఆసక్తికరమైన పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్‌లో రుక్మిణితో పాటు దేవ్ రామ్‌నాథ్, వినాయక్ వైతినాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రాన్ని ఒక క్రేజీ, సాహసంతో కూడిన, హృదయాలను హత్తుకునే ప్రయాణంగా వర్ణించగా, 'ఒకే ఒక జీవితం' లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనస్సులలో ఎప్పటికీ నిలిచిపోతుందని సోషల్ మీడియా ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రత్యేక ప్రకటన వీడియోలో దర్శకుడు శ్రీ కార్తీక్, నటులు రుక్మిణి వసంత్‌ను కలిసి కథ వినిపించడం, ఆమె ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎంతో వినూత్నంగా చూపించారు. సరికొత్త కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఫన్‌ఫుల్ రోడ్-ట్రిప్ డ్రామాపై అప్పుడే సినీ వర్గాల్లో మంచి అంచనాలు ప్రారంభమయ్యాయి.
మాడ్‌బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సిరూని సినీ కార్పొరేషన్ పతాకాలపై సాయికృష్ణ గాడ్వాల్ కో-ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.