నా బాల్యాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది.. ట్రోలర్స్‌కు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ హెచ్చరిక
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దాదాపు ప్రతి ఒక్కరూ తమ కొత్త చిత్రాల ప్రమోషన్ల కోసం పాడ్‌కాస్ట్‌లను ఎంచుకుంటున్నారు. వీటిలో నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలు, తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు మరియు వ్యక్తిగత విషయాలను పంచుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే బాలీవుడ్ దిగ్గజ నటుడు మనోజ్ బాజ్‌పాయీ మాత్రం ఈ తరహా ఇంటర్వ్యూలపై పూర్తి విముఖత వ్యక్తం చేశారు. ఇకపై తాను ఎలాంటి పాడ్‌కాస్ట్‌లలోనూ పాల్గొనబోనని తేల్చిచెప్పిన ఆయన, తన బాల్యం నాటి కష్టాల గురించి పదే పదే మాట్లాడటం వల్ల తన చిన్ననాటి జ్ఞాపకాలపైనే అసహ్యం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ముంబైలో నిర్వహించిన ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న మనోజ్ బాజ్‌పాయీ తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మీడియా వేదికగా పంచుకున్నారు. ఒక పల్లెటూర్లో జన్మించి సినీ రంగానికి రావడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా అనిపించవచ్చు కానీ, ఆ ప్రయాణాన్ని స్వయంగా అనుభవించిన తనకు మాత్రం అది నరకంతో సమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కాకుండా ఢిల్లీ లేదా ముంబై వంటి నగరాల్లో పుట్టి ఉంటే తన జీవిత ప్రయాణం మరింత సులభంగా ఉండేదని తెలిపారు. చేతిలో ఐదు పైసలు కూడా లేకుండా ఐదు రోజుల పాటు గడిపితే గానీ జీవితం అసలు పాఠాలు నేర్పదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మనోజ్ బాజ్‌పాయీ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం గజబ్ రాత్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మొదట ఘూస్ ఖోర్ పండత్ అనే శీర్షికను నిర్ణయించగా, దానిపై సోషల్ మీడియాలో తీవ్ర వివాదం నెలకొంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఏకంగా ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలను నెట్‌లో పోస్ట్ చేస్తూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్‌పై ఆయన అత్యంత తీవ్రంగా స్పందించారు. నటుడిగా తనపై ఎలాంటి విమర్శలు చేసినా భరిస్తానని, కానీ కుటుంబ సభ్యుల జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధమని హెచ్చరించారు.
కాగా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న గజబ్ రాత్ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయీతో పాటు నుష్రత్ భరుచా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్, దివ్య దత్తా, కికు శర్దా, శ్రద్ధా దాస్ కీలక పాత్రల్లో నటించారు. తన నటనతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న మనోజ్, ఈ వేదికపై చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు మరియు ట్రోలర్లకు ఇచ్చిన గట్టి కౌంటర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి.
Also Read: అలరించడానికి సిద్ధమవుతున్న ‘పుష్పక విమానం’ వెబ్ సిరీస్ ట్రైలర్