చకోర' నుంచి 'శివ ట్రాన్స్' సాంగ్ రిలీజ్.. అక్టోబర్ 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలతో పాటు సరికొత్త ప్రయోగాలకు తెరలేపుతున్న మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ 'చకోర – Lunar Love Bird'. హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, విఐపి (Vintage Iconic Pictures) నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ 'శివ ట్రాన్స్' వీడియో సాంగ్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన 'శివ ట్రాన్స్' ప్రమోషనల్ వీడియో సాంగ్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రిన్స్ హెన్రీ ఎనర్జిటిక్ ర్యాప్ బీట్స్‌తో ఈ పాటను చాలా క్యాచీగా కంపోజ్ చేశారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన అద్భుతమైన సాహిత్యానికి, రితేష్ రావ్ తన గళంతో ప్రాణం పోశారు. శివుడిని కీర్తిస్తూ ర్యాప్ బీట్ మిక్స్ చేసి డిజైన్ చేసిన ఈ పాట టాలీవుడ్‌లో ఒక సరికొత్త ప్రయోగంగా సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
వైజాగ్ బీచ్‌లోని ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ పాటకు సంబంధించిన చిత్రీకరణను అత్యంత కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. ఈ పాటలో కేవలం నటీనటులే కాకుండా మూవీ టీమ్ మెంబర్స్ అందరూ పాల్గొని సందడి చేయడం విశేషంగా నిలిచింది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్న ఈ మ్యూజికల్ బిట్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న 'చకోర' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోనని చిత్ర యూనిట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.