పసిపిల్లల ఆహారంలో పంచదారకు నో...ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయం!
సూర్య జాతీయ డెస్క్ (న్యూఢిల్లీ): ఆరు నెలలలోపు పసిపిల్లలకు అందించే ఆహార ఉత్పత్తుల్లో పంచదార, తీపి పదార్థాల వాడకంపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. చిన్న పిల్లల పోషకాహార ఉత్పత్తులలో సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలను కలపడాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా సవరణ నోటిఫికేషన్ను విడుదల చేసింది. చిన్నతనంలోనే పంచదారకు అలవాటు పడకుండా నియంత్రించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఆహార భద్రత మరియు ప్రమాణాల (ఇన్ఫాంట్ న్యూట్రిషన్) సవరణ నిబంధనలు, 2026 పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను కేంద్ర గెజిట్లో ప్రచురించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు పిల్లలకు అందించే ఫార్ములా ఆహారంలో పరిమిత మోతాదులో సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ వాడకానికి మినహాయింపు ఉండగా, కొత్తగా తీసుకొస్తున్న సవరణ ద్వారా ఈ మినహాయింపును పూర్తిగా తొలగించనున్నారు. ప్రాథమిక దశలో శిశువులకు తల్లిపాలు మాత్రమే అత్యుత్తమమైనవని స్పష్టం చేస్తూ, ఒకవేళ ప్రత్యామ్నాయ పోషకాహారం అందించాల్సి వస్తే అందులో ఎటువంటి అదనపు చక్కెరలు ఉండకూడదని ఎఫ్ఎస్ఎస్ఏఐ తేల్చిచెప్పింది.
చిన్న వయస్సులోనే తీపి పదార్థాలను ఆహారంలో తీసుకోవడం వల్ల పిల్లలలో స్థూలకాయం, దంత సమస్యలు మరియు భవిష్యత్తులో ఇతర జీవక్రియ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలు, తయారీదారులు మరియు సాధారణ ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం ఈ సవరణ నిబంధనలను ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారికంగా అమల్లోకి తీసుకురానుంది. పసిపిల్లల ఆరోగ్య భద్రత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.