ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి
*లింగరావుపల్లిలో సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి*
తలకొండపల్లి,రంగారెడ్డి : మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఎల్ నినో (El Niño) ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించడం, వ్యవసాయ రంగానికి అవసరమైన నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వ్యవసాయానికి, తాగునీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, నీటి సంరక్షణకు ఉపయోగపడే పనులను గుర్తించి చేపట్టాలని సమావేశంలో చర్చించారు. భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
నీటి సంరక్షణ, గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గ్రామస్థాయిలో సమష్టి కృషి అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామ ప్రజలు, రైతులు నీటి పొదుపు చర్యలను పాటిస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ శ్రీ కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ బూత్కూరి వెంకటరెడ్డి, MPO లక్పతి నాయక్, పంచాయతీ కార్యదర్శి మహేష్, మాజీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి మేజర్ న్యూస్