వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు
కోహెడ ; కొహెడ మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు. ఈ పర్యటనల్లో మండల వ్యవసాయ అధికారి సతీష్ , వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) పాల్గొని వరి, పత్తి తదితర పంటల ఎదుగుదల స్థితిని, చీడపీడల ఉధృతిని పరిశీలించారు. వరి పంటలో కొన్ని ప్రాంతాల్లో బ్రౌన్ ప్లాంట్ హాపర్ (బిపిహెచ్ ) పురుగు ఉనికిని గుర్తించి, దాని నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు అందించారు. పంటలో పురుగు ఉధృతిని క్రమం తప్పకుండా గమనించాలని, అవసరమైనప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల సముదాయం (సుకింగ్ పేస్ట్ కాంప్లెక్స్ ) ఉనికిని గుర్తించి, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని రైతులకు వివరించారు. పురుగుల ఉధృతిని గమనిస్తూ, అవసరమైనప్పుడు సిఫార్సు చేసిన పురుగుమందులను సరైన మోతాదులో మాత్రమే వినియోగించాలని, పురుగుమందుల మిశ్రమాలను అనవసరంగా ఉపయోగించరాదని సూచించారు.అదేవిధంగా, వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు పంటల్లో తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని, అవసరానికి అనుగుణంగా నీటి వినియోగాన్ని నియంత్రించాలని, కలుపు మొక్కలను నివారించాలని, నేలలో తేమను కాపాడే పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు.
పత్తిలో రసం పీల్చే పురుగుల ఉదృతి అధికంగా ఉన్నట్లయితే ఎసిఫేట్ 300గ్రా/ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 600 ఎంఎల్ /ఎకరానికి లేదా థయోమితాక్సీమ్ 80 గ్రా /ఎకరానికి పిచికారి చేసుకోవాలి, వరిలో సుడిదోమ ఉదృతి అధికంగా ఉన్నట్లయితే పైమెట్రోజిన్ 120గ్రా/ఎకరానికి లేదా ట్రైఫ్లూమెజొపైరిమ్ 100మి. లి/ఎకరానికి లేదా డినోటెఫ్యూరాన్ 80 గ్రా/ఎకరానికి పిచికారి చేసకోవాలి.రైతులు తమ పంటల్లో చీడపీడల లక్షణాలను గమనించిన వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి, వారి సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు రాజు, మహేందర్, భూంరెడ్డి, మ్యాకల మహేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.