కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలుపే లక్ష్యం
- నందివాడ మండల నేతలతో ప్రజావేదికలో ఎమ్మెల్యే సమీక్ష
నందివాడ, అక్టోబర్ 17, మేజర్ న్యూస్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు గోడల మధ్య కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తలు, స్థానిక నాయకత్వ అభిప్రాయం మేరకే ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో నందివాడ మండల టీడీపీ, కూటమి నేతలతో ఆయన శనివారం ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 90 శాతం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, వరదల సమయంలో కూటమి కార్యకర్తలు అందించిన సేవలను ప్రజలు గుర్తించారని గుర్తుచేశారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి కూటమి అభ్యర్థుల భారీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిన్నమనేని బాబ్జి, మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, నాయకులు సీతయ్య, సాల్మన్ రాజు, యార్లగడ్డ రవి తదితరులు పాల్గొన్నారు.