telanagana
ప్రజా సమస్యలపై కార్పొరేటర్ తక్షణ స్పందన - గుంతలకు తాత్కాలిక మరమ్మతులు
సూర్య నస్పూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్ శనివారం తక్షణ చర్యలు చేపట్టారు. ప్రజల అవసరాలను గుర్తించి సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కృష్ణా కాలనీలోని గౌరీ సుత గణేశ్ మండపం ఎదుట ఉన్న గ్రౌండ్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శుభ్రత పనులు చేపట్టారు. కాలనీ ఆటో యూనియన్ సభ్యులు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేయడంతో వెంటనే జేసీబీని పంపించి గ్రౌండ్‌ను శుభ్రం చేయించి చదును చేయించారు. త్వరలోనే అక్కడ సిమెంట్ పనులు కూడా చేపట్టి గ్రౌండ్‌ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమస్యపై వెంటనే స్పందించిన కార్పొరేటర్‌కు కృష్ణా కాలనీ ఆటో యూనియన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే అండర్ బ్రిడ్జి సమీపంలోని చర్చి వద్ద హైవే రోడ్డుపైకి వెళ్లే మార్గంలో గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్ జేసీబీని రప్పించి గుంతల్లో మట్టి పోయించి రహదారిని తాత్కాలికంగా సమం చేయించారు. దీంతో వాహనదారులకు కొంతమేర ఇబ్బందులు తగ్గనున్నాయి. త్వరలోనే ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన కార్పొరేటర్‌ను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగిడి రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.