telanagana
ఆయుధాల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్, (సూర్య): ఆయుధాలు, మందుగుండు సామగ్రి భద్రత విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) హెడ్క్వార్టర్స్లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ను ఆమె తనిఖీ చేసి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మ్యాగజైన్ గది, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయుధాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఆయుధాల జారీ, స్వీకరణకు సంబంధించిన రికార్డులను సమీక్షించారు. స్టాక్ లెడ్జర్, వీక్లీ క్లీనింగ్ రిజిస్టర్, అధికారులు, పీఎస్ఓలకు ఆయుధాల జారీ రిజిస్టర్, జారీ, స్వీకరణ వోచర్లు, గత తనిఖీల రికార్డులు, వార్షిక ఆయుధ తనిఖీ ఈ-05 బుక్, బేస్ రిపేర్ వర్క్షాప్ బుక్, మందుగుండు సామగ్రి స్టాక్ లెడ్జర్ తదితర రికార్డులను పరిశీలించారు.అనంతరం మ్యాగజైన్ గదిని సందర్శించి, అక్కడ భద్రపరిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి వివరాలను తనిఖీ చేశారు. ఆయుధాలను నిబంధనల ప్రకారం భద్రపరచడంతో పాటు వాటి శుభ్రత, నిర్వహణపై నిరంతరం దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఆయుధాల జారీ, స్వీకరణకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఆయుధాల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో వికారాబాద్ ఏఆర్ డీఎస్పీ యు. వీరేష్, ఆర్ఐలు పి. నాగరాజు, ఎం. శ్రీశైలం గౌడ్, కె. అశోక్, ఆర్ఎస్ఐలు రాము, బాలాజీ నాయక్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.