నాగర్ కర్నూల్ లో 5రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె -కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో భిక్షాటన ర్యాలీతో వినూత్న నిరసన
జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో భిక్షాటన ర్యాలీ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులందరినీ షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలనీ, రాష్ట్రవ్యాప్తంగా ఎన్.హెచ్.ఎం పరిధిలోని 78 క్యాడర్లలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్.హెచ్.ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు నిరంతరం సేవలందిస్తున్నారని, అయినప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎన్.హెచ్.ఎం జేఏసీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు డా బాలకృష్ణ, ప్రదాన కార్యదర్శి దామగట్ల కుమార్, ఎన్.హెచ్.ఎం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌస్ పాషా,డా.జగన్, డా రామకృష్ణ రెడ్డి, సాయి కంఠ, డా.మహాతి, డా. సంధ్య రాణి పాల్గొన్నారు.
పి. వినయ్ కుమార్ , నాగర్కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్