యువతలో నాయకత్వ లక్షణాల పెంపునకు యూత్ పార్లమెంట్ పోటీలు దోహదం
మచిలీపట్నం, మేజర్ న్యూస్: యువతలో నాయకత్వ లక్షణాలు, విశాల దృక్పథం, విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు యూత్ పార్లమెంట్ పోటీలు దోహదపడతాయని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – 2027లో భాగంగా కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న యూత్ పార్లమెంట్ పోటీలు – 2027లో పాల్గొనే విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యా సంబంధిత పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవం, ఆచరణాత్మక జ్ఞానం, వివిధ అంశాలపై అవగాహన నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరమన్నారు. గెలుపోటముల కంటే పోటీల్లో పాల్గొని పొందే అనుభవమే భవిష్యత్తులో ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకుని, వాటి సాధనకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ వంటి కృత్రిమ మేధ సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె. రాంజీ, రిజిస్ట్రార్ డాక్టర్ ఉషా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రావణి, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్, అధ్యాపకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.