వృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు : అర్బన్ డీఎస్పీ భక్తవత్సలం
వృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారని, వారి అనుభవాలు కుటుంబానికి ఎంతో మేలు చేస్తాయని తిరుపతి అర్బన్ డీఎస్పీ భక్తవత్సలం అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అన్నమయ్య మార్గ్ లోని రాస్ నిలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వయోవృద్ధుల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేసిందని, సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే మోసపోవద్దని హెచ్చరించారు. కుటుంబాల్లో కోపాలు, ఆవేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. వృద్ధులకు అన్యాయం జరిగితే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా నిమిషంలో పోలీసు సహకారం అందుతుందని తెలిపారు.న్యూ బాలాజీ కాలనీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా రాస్ వృద్ధులకు సేవలు అందిస్తోందని కొనియాడారు. 25 మంది వృద్ధులకు చేతికర్రలు, దుప్పట్లు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి, మంగళం, ఏర్పేడు, పాపానాయుడుపేట గ్రామాల నుండి సుమారు 250 మంది వృద్ధులు హాజరయ్యారు.రాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు, అధికారులు బాలాజీరెడ్డి, రవి, నాగేశ్వర్, గిరి, కుమార్, నాగరత్నమ్మ పాల్గొన్నారు.