విజయవాడలో అట్టహాసంగా 'జాతీయ సరస్ ఆజీవిక మేళా
–2026' - అక్టోబర్ 13 నుంచి పున్నమి ఘాట్‌లో ప్రారంభం - నవరాత్రి శోభతో పాటు గ్రామీణ మహిళా శక్తికి వేదికగా సరస్ మేళా - 576 స్టాళ్లతో అద్భుత ఏర్పాట్లు - స్వయం ఏపీ బ్రాండ్ అమ్మకాలకు సువర్ణావకాశం - మంత్రి కొండపల్లి శ్రీనివాస్
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
: దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తల అద్భుతమైన ఉత్పత్తులకు జాతీయస్థాయిలో గొప్ప మార్కెటింగ్ వేదికగా ' జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026 ' నిలుస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో ఏర్పాటవుతోందని మంత్రి కొనియాడారు. ఈ మేళాలో రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లు ఏర్పాటు చేశామని.. రాష్ట్రం నుంచి అత్యధికంగా 208 స్టాళ్లు ఉండగా, రాజస్థాన్ (24), మధ్యప్రదేశ్ (23), ఉత్తరప్రదేశ్ (22), మహారాష్ట్ర (21), పశ్చిమ బెంగాల్ (19), కేరళ (17), పంజాబ్ (17) రకరకాల స్టాల్స్ ఈ మేళాలో కొలువు దీరుతున్నాయని కొండపల్లి స్పష్టం చేశారు. ఏపీ ఎస్‌హెచ్‌జి మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు 'స్వయం ఏపీ' బ్రాండ్ కింద తమ ఉత్పత్తులను జాతీయ స్థాయిలో ప్రదర్శించి, విక్రయించేందుకు ఇది సువర్ణావకాశం అని... చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో సెర్ప్ (SERP), మెప్మా (MEPMA) సంస్థలు అంకితభావంతో పనిచేస్తున్నాయని మంత్రి కొనియాడారు. నవరాత్రి ఉత్సవాలతో పాటు సరస్ మేళా శోభ : ప్రసిద్ధ బెజవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో పాటు జాతీయ సరస్ ఆజీవిక మేళా ఒకే సమయంలో జరగడం భక్తులకు, ప్రజలకు గొప్ప అవకాశమని మంత్రి తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చేవారు ఈ మేళాను సందర్శించి దేశవ్యాప్త రుచులు, వస్తువులను ఆస్వాదించవచ్చని పిలుపునిచ్చారు. ఈ మేళాలో చేనేత ఉత్పత్తులు ఉప్పాడ, వెంకటగిరి, పట్టు చీరలు, కలంకారి వస్త్రాలు, ఖాదీ దుస్తులు మరియు గృహ అలంకరణ వస్తువులతో పాటు చేతిపనుల వస్తువులైన చెక్క శిల్పాలు, టెర్రకోట పాత్రలు, జూట్ బ్యాగులు, ప్రకృతి సిద్ధమైన సబ్బులు, హెర్బల్ ఉత్పత్తులు కూడా ప్రదర్శనలో ఉంచుతారని తెలిపారు. అలాగే చిరుధాన్యాలు (మిల్లెట్స్), సంప్రదాయ స్వీట్లు, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు, నాణ్యమైన ఊరగాయలు, తేనె మరియు అటవీ సహజ ఉత్పత్తులతో పాటు వివిధ రాష్ట్రాల ప్రసిద్ధ లైవ్ ఫుడ్ స్టాళ్లు కూడా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. మేళాకు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశాలమైన పార్కింగ్, తాగునీరు, భద్రత మరియు వైద్య శిబిరాలు వంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నామని... విజయవాడ చుట్టుపక్కల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామీణ మహిళా శక్తిని ప్రోత్సహించాలని మంత్రి కొండపల్లి విజ్ఞప్తి చేశారు