ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో వైభవంగా భిక్షా కార్యక్రమం ప్రారంభం:
ముమ్మిడివరం మేజర్ న్యూస్ : స్థానిక ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో మండల దీక్షా కాలాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములు, భవానీ దీక్షాపరులకు అన్నదాన (భిక్ష) కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. మండల కాలం పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా కొనసాగే ఈ సేవా కార్యక్రమం తొలిరోజు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా మొదలైంది.
మొదటి రోజు భిక్షా కార్యక్రమాన్ని పెన్మత్స సీతారాముడు గురుస్వామి ఏర్పాటు చేయగా, ఆలయ అర్చకులు వికాస్ శర్మ వేద మంత్రోచ్ఛారణల నడుమ జగ్గప్పరాజు గురుస్వామి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమీప గ్రామాలు, ప్రాంతాల నుంచి అయ్యప్ప, భవానీ మాలధారణ చేసిన భక్తులు, దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజాదికాల అనంతరం భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సరిపెల్ల రామకృష్ణంరాజు, అల్లూరి చిట్టిబాబు స్వామి, కాజులూరి రామలింగేశ్వరరావు స్వామి, మొల్లేటి లక్ష్మణరావు స్వామి, ధర్మరాజు స్వామి, గణపతి స్వామిలతో పాటు పెద్ద సంఖ్యలో గురుస్వాములు, అయ్యప్పలు, భవానీలు, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.