విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి
విద్యుత్ చౌర్యం గుర్తింపు, పెండింగ్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి – విజిలెన్స్ ఎస్‌ఈ హేమలత
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడంతో పాటు, విద్యుత్ బకాయిల వసూళ్లను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని APSPDCL విజిలెన్స్ విభాగపు సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీమతి హేమలత కోరారు. ఈ రోజు నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. సుధాకర్‌ను ఆయన చాంబర్‌లో శ్రీమతి హేమలత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (విజిలెన్స్) శ్రీమతి లక్ష్మీప్రసూన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కడైనా అక్రమ విద్యుత్ వినియోగం, విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు, దాడులు నిర్వహించాలని శ్రీమతి హేమలత సూచించారు. విద్యుత్ చౌర్యం వల్ల సంస్థకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని, పెండింగ్ విద్యుత్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అవసరాన్ని బట్టి రాత్రి వేళల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా అక్రమ విద్యుత్ వినియోగాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. సుధాకర్ మాట్లాడుతూ, తాను జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ప్రతిసారీ విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాల్సిన అవసరంపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో విద్యుత్ చౌర్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, విద్యుత్ ఆదాయాన్ని పరిరక్షించడం, వినియోగదారులకు నిబంధనల ప్రకారం నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడం కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.