వీఎస్‌యూలో మేధో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం
వెంకటాచలం మేజర్ న్యూస్ : విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, పరిశోధనా దృక్పథం, పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో మేధో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐఐటీడీఎం కర్నూలు సహకారంతో, ఏపీఎస్ఎంఎఈ అభివృద్ధి సంస్థ మద్దతుతో కేంద్ర ప్రభుత్వ ర్యాంప్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి వీఎస్‌యూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, మేధో సంపత్తి అధికారి ఎస్. శ్రీనివాస్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన డాక్టర్ రాధిక వంగల పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, మేధో సంపత్తి హక్కుల ప్రాధాన్యతను వివరించారు. నూతన ఆలోచనలకు చట్టపరమైన రక్షణ పొందడం, వాటిని వ్యాపార ఉత్పత్తులు, సేవలుగా అభివృద్ధి చేసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వయం ఉపాధి, నూతన వ్యాపార అవకాశాలు, ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వ సహకారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమ నిర్వహణలో వీఎస్‌యూ ప్రిన్సిపాల్ డాక్టర్ వీరారెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఆచార్య ఎం. ఉస్సేనయ్య, ఆచార్య అందే ప్రసాద్ సహకరించారు. ముగింపులో ఐఐఐటీడీఎం కర్నూలుకు చెందిన ఆచార్య కె. విశ్వేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.