వేదిక్ రామేశ్వర్ ఠాకూర్ స్మృతి సంకలనం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీ వేధిక్ వర్సిటీ స్థాపనకు కృషి చేసిన పూర్వ ఏపీ గవర్నర్, వర్సిటీ తొలి వీసీ దివంగత రామేశ్వర్ ఠాకూర్ పేరుతో స్మృతి సంకలనం జాతీయ సదస్సు వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. గురువారం జరిగిన ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా మాజీ టీటీడీ ఈఓ, వేదిక్ వర్సిటీ మాజీ వీసీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ స్థాపనకు అంకుఠిత దీక్షతో రామేశ్వర్ ఠాకూర్ కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. వేదిక ధర్మం, వేద పరిరక్షణ పట్ల రామేశ్వర్ ఠాకూరు ఉన్న అచంచలమైన విశ్వాసం, అంకితభావం అద్వితీయమైనవని వివరించారు. అనంతరం వీసీ గణపతి భట్ మాట్లాడుతూ వైదిక లోకమంతా రామేశ్వర్ ఠాకూర్ సదా రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు, పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రియ శిష్యులుగా రామేశ్వర్ ఠాకూరు వేదం, సనాతన ధర్మం పట్ల లోతైన అభిరుచి, అంకితభావం అలవడ్డాయని తెలిపారు. సంస్థ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో ఆయన పవిత్ర స్మృతిని గౌరవించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిని వీసీ, రిజిస్ట్రార్ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు' పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుడిగా, పరిపాలనా దక్షుడిగా, వేద వాఙ్మయ సంరక్షకుడిగా రామేశ్వర్ ఠాకూర్ సమాజానికి, విద్యా రంగానికి అందించిన బహుముఖ సేవలను విశ్లేషిస్తూ ప్రసంగించారు. ఈ సదస్సులో రిజిస్ట్రార్ డాక్టర్ బలభద్ర ఉపాధ్యాయ, డీన్ డాక్టర్ తారక రామకుమార శర్మ, పీఆర్వో డాక్టర్ గంజాం రామకృష్ణ, వివిధ విభాగాల డీన్లు, విభాగాధ్యక్షులు, బోధనబోదనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్