ఆనందపురం సీఐ మానవత్వానికి నిదర్శనం.. వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీస్ అధికారి!
ఆనందపురం, సూర్య : పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మాత్రమే కాదు.. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలికి అండగా నిలిచి, ఆప్యాయతతో వీల్ చైర్ లో కూర్చోబెట్టుకొని పోలింగ్ బూత్ వరకు తీసుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం పోలీసుల బాధ్యత అని ఆనందపురం పోలీస్ స్టేషన్ సీఐ ఎర్రం నాయుడు తన చర్యల ద్వారా చాటిచెప్పారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని గమనించిన ఆనందపురం సీఐ ఆమె పరిస్థితిని చూసి మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే స్వయంగా ఆమెకు సహాయం అందించి, వీల్‌చైర్‌పై కూర్చోబెట్టి, అవసరమైన సహకారం అందించారు. అధికార హోదాను పక్కనపెట్టి, ఓ వృద్ధురాలికి ఆప్యాయతతో అండగా నిలిచిన సీఐ సేవాభావం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పోలీసులలో దాగి ఉన్న మానవత్వానికి ఈ సంఘటన ఒక చక్కని నిదర్శనంగా నిలుస్తోంది.