వయసు మీద పడినా.. ఓటు హక్కుపై చెక్కుచెదరని బాధ్యత!
సంతదాసుపల్లి, మేజర్ న్యూస్ : ప్రజాస్వామ్యంలో ఓటు విలువను చాటిచెబుతూ ఓ వృద్ధురాలు అందరికీ ఆదర్శంగా నిలిచారు. వయసు మీద పడినా, వృద్ధాప్యపు అలసటను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో వయసుతో సంబంధం లేదని, ప్రతి ఓటు ఎంతో విలువైనదని ఆమె తన చర్యతో చాటిచెప్పారు. సంతదాసుపల్లి సెగ్మెంట్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా చంబడపాలెం, విందూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ఉన్నతాధికారులు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.