నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ *
విశాఖపట్నం, సూర్య : నగరంలోని రహదారులు, బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన జీవీఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలోని సిరిపురం జంక్షన్, బాలాజీనగర్, బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ వరకు పర్యటించి పారిశుధ్య పనులు, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు, ఇటీవల తుఫాను కారణంగా పేరుకుపోయిన చెట్ల కొమ్మలు, ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియను ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, సహాయక వైద్యాధికారి బి. ప్రసాద్ రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా సిరిపురం జంక్షన్, బాలాజీనగర్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్, ఇటీవల తుఫాను కారణంగా నేలకొరిగిన చెట్ల కొమ్మలు, పేరుకుపోయిన వ్యర్థాలను ఇంకా పూర్తిస్థాయిలో తొలగించకపోవడంపై సంబంధిత ప్రజారోగ్య అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వాటిని తక్షణమే తొలగించి, తరలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
రోడ్లపై వ్యర్థాలు పేరుకుపోకుండా ఇంటింటి నుంచి చెత్త సేకరణను వంద శాతం చేపట్టాలని, సేకరించిన చెత్తను వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు తరలించాలని స్పష్టం చేశారు. చెత్త సేకరణలో జాప్యం కారణంగా వ్యర్థాలు పేరుకుపోయే ప్రాంతాలు (వల్నరబుల్ పాయింట్లు) పెరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సహాయక వైద్యాధికారికి సూచించారు.
అనంతరం పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ వరకు రహదారులు, బీచ్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. త్వరలో విశాఖపట్నంలో సీఐఐ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ అతిథులు, ప్రతినిధులు నగరాన్ని సందర్శించనున్నారని, ముఖ్యంగా బీచ్ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున నగర ప్రతిష్ఠకు తగిన విధంగా రహదారులు, బీచ్ రోడ్డు, బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా, సుందరంగా ఉంచాలని సూచించారు. ఇందుకోసం ప్రతిరోజూ నిరంతర పారిశుధ్య పనులు నిర్వహించి, ప్రత్యేక శ్రద్ధ వహించాలని జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్‌కు ఆదేశించారు.
బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్, రాత్రి వేళల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్లు, బీచ్ పరిసరాలు, బీచ్ ప్రాంతాల్లో రాత్రిపూట కూడా పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు.
పారిశుధ్య పనుల నిర్వహణలో లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, బీచ్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సహాయక వైద్యాధికారి బి. ప్రసాద్ రావుకు కమిషనర్ సూచించారు.