వచ్చే రెండు దశాబ్దాలు దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో రాబోయే ఇరవై సంవత్సరాలు అత్యంత కీలకమని, నైపుణ్యం కలిగిన యువశక్తే దేశానికి అసలైన బలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'మిషన్ కర్మయోగి' ప్రాంతీయ వర్క్‌షాప్‌ను సీఎం జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో పరిపాలన నైపుణ్యాల పెంపు, సామర్థ్య నిర్మాణంపై ఆయన దిశానిర్దేశం చేశారు.
గతంలో పోలిస్తే దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయని పేర్కొన్న ముఖ్యమంత్రి, కేవలం 45 ఏళ్ల వ్యవధిలోనే చైనా సూపర్ పవర్ స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ టెక్నాలజీ కంపెనీలను మన దేశం వారే లీడ్ చేస్తున్నారని, 1990ల నాటి సంస్కరణల్లో టెక్నాలజీని సకాలంలో అడాప్ట్ చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలిచే సత్తా మన దేశానికి ఉందని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నిరంతరం శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ వర్క్‌షాప్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఒడిశా తదితర దక్షిణ మరియు తూర్పు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.