ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం
జీఐ ట్యాగ్ దరఖాస్తులు దాఖలకు సహకారం
చాన్సల్లర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి వెల్లడి
మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (మిట్స్-ఐపీఎఫ్‌సీ) ఆధ్వర్యంలో 50 భౌగోళిక సూచి (జీఐ) ట్యాగ్‌ల కోసం అధికారికంగా దరఖాస్తులు సమర్పించబడినట్లు మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో 37 దరఖాస్తులు అనంతపురం,చిత్తూరు,అన్నమయ్య,వైఎస్ఆర్ కడప,తిరుపతి జిల్లాలకు చెందిన వ్యవసాయ,ఉద్యానవన ఉత్పత్తులకు సంబంధించినవన్నారు.ఈ ఉత్పత్తులలో ముఖ్యంగా మదనపల్లె టమాటా,మదనపల్లె చింతపండు,మదనపల్లె నేరేడు పండు,అనంతపురం దానిమ్మ,బత్తాయి,తాడిపత్రి జామ,కడప అరటి,బొప్పాయి,ముల్ల వంకాయ,చిత్తూరు సపోటా,చిత్తూరు టోటాపురి,నీలం,బాదామి మామిడి రకాలు,చిత్తూరు పింక్ జామ,కుప్పం ఉలవలు,రాగి తదితర ఉత్పత్తులు ఉన్నాయి.మదనపల్లె కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ నేపథ్యంలో ఈ జీఐ దరఖాస్తులకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు.రాయలసీమలో ఉద్యాన ఉత్పత్తుల సాగు,ఉత్పత్తి,ప్రాసెసింగ్,నిల్వ,మార్కెటింగ్,ఎగుమతులకు సమగ్ర మౌలిక వసతులు కల్పించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే హార్టికల్చర్ హబ్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ఈ జీఐ దరఖాస్తులు ఆయా ప్రాంతాల ప్రత్యేక ఉత్పత్తుల వైవిధ్యాన్ని,వాటి భౌగోళిక మూలంతో ఏర్పడిన ప్రత్యేక గుర్తింపు,నాణ్యత,ప్రతిష్టను పరిరక్షించేందుకు చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తాయన్నారు.మిగిలిన దరఖాస్తులు వివిధ కళాకారులు,ఇతర ఉత్పత్తిదారుల సంస్థలకు సంబంధించిన ఉత్పత్తుల కోసం ధాఖలైనట్లు తెలిపారు.జీఐ దరఖాస్తుల ప్రక్రియలో ఎం-టమాటో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్,శ్రీ చౌడేశ్వరి సిల్క్ సారీస్ సొసైటీ,శ్రీ సాయి చింతపండు సొసైటీ,శ్రీ భూదేవి నేరేడు ఫ్రూట్ సొసైటీ,ఏఎఫ్‌ఎల్‌ఏబీటీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్,శ్రీ వాసవి ఫుడ్ ప్రొడక్ట్స్ సొసైటీ,ట్రెడిషనల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోటింగ్ సొసైటీ,శ్రీ రామ హార్టికల్చరల్ ప్రొడక్ట్స్ ప్రమోటింగ్ సొసైటీ,శ్రీ వెంకటేశ్వర ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ తదితర సంస్థలు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు.ఈ దరఖాస్తు దాఖలు కావడానికి సహకరించిన ప్రొడ్యూసర్ కంపెనీలు,రైతు సంఘాలు,సొసైటీలు మరియు సంబంధిత సంస్థలను,మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (మిట్స్ - ఐ.పీ.ఎఫ్.సి) మరియు మిట్స్ అడ్వైజర్ (ఆర్ & డి) మరియు మిట్స్ - ఐ.పీ.ఎఫ్.సి ప్రధాన సమన్వయకర్త డాక్టర్ తులసీరామ్ నాయుడు,అసోసియేట్ డీన్ (ఆర్ అండ్ డి) డాక్టర్ పి.శివయ్యల కృషిని ఆయన అభినందించారు.రైతు కేంద్రిత ఆవిష్కరణలు,సంప్రదాయ వ్యవసాయ జ్ఞాన పరిరక్షణ,ప్రాంతీయ వ్యవసాయ ఉత్పత్తులకు మేధోసంపత్తి హక్కుల ద్వారా చట్టబద్ధమైన గుర్తింపు తీసుకురావడంలో మిట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన వెల్లడించారు.