తుఫాన్ వేళ తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు
- అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అప్రమత్తం
- ఓవర్‌హెడ్ ట్యాంకుల నింపకం, క్లోరినేషన్‌కు చర్యలు
పార్వతీపురం, సూర్య: అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా పార్వతీపురం మన్యం జిల్లా ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్. వైశాలి ఆదేశాల మేరకు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి, గ్రామ పంచాయతీల పరిధిలోని ఓవర్‌హెడ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపాలని ఆదేశించారు. అలాగే తాగునీటి ట్యాంకులకు క్లోరినేషన్ చేయడం, భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే నీటి వనరులను ముందుగానే గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడం, బోరుబావులు, తాగునీటి పథకాల్లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ తాగునీటి సరఫరా నిలిచిపోకుండా జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల్లో డ్రెయినేజీ, పారిశుధ్య పనులను కూడా ముమ్మరం చేశారు. అలాగే తుఫాన్ అత్యవసర పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పార్వతీపురం డివిజన్ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్. వైశాలి ఆదేశాల మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నారని అధికారులు తెలిపారు.