తిరుమలలో శ్రీవారి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు: సర్వదర్శనానికి 15 గంటల సమయం
తిరుమల :తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో, మిగిలినవారు వెలుపల ఉన్న క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దర్శన టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
మరోవైపు శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే మొత్తం 78,228 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 25,564 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.4.01 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.