తాడిగడపలో అక్టోబరు 11 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
తాడిగడప, మేజర్ న్యూస్ : విజయవాడ సమీపంలోని తాడిగడప 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో వర్ణం, సియోస్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తోటపల్లి గౌతం, కోట ప్రసన్నకుమార్, సుధాకర్ తెలిపారు. బందరు రోడ్డులోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో బుధవారం ఉత్సవాల ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ శ్రీ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు, చండీ హోమాలతో పాటు ప్రత్యేక పాశుపత హోమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబరు 11న గణపతి పూజ, కలశస్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజూ సామూహిక కుంకుమార్చనలు, అమ్మవారికి అభిషేకాలు, దర్బారు సేవలు, హారతులు నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల శ్రేయస్సు కోసం 11న లక్ష్మీ గణపతి హోమం, 12న మహా మృత్యుంజయ పాశుపత హోమం, 13న సుబ్రహ్మణ్య పాశుపత హోమం, 14న సుదర్శన లక్ష్మీనరసింహ పాశుపత హోమం తదితర ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. చివరి రోజైన అక్టోబరు 20న లక్ష్మీ కుబేర పాశుపత హోమం, పుష్పయాగం, మహా మంగళ పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. పది రోజుల పాటు ప్రతిరోజూ దాండియా నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.