విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే గురువు అసలైన విజయం
సూర్య తెలంగాణ డెస్క్: ఉపాధ్యాయుడిగా పనిచేసిన పాఠశాల, అక్కడి విద్యార్థులు, వారితో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మరిచిపోలేని తీపి జ్ఞాపకాలేనని సంగారెడ్డి జిల్లా మనూర్ మండల విద్యాశాఖ అధికారి రాజశేఖర్ శెట్కార్ తెలిపారు. బోరంచ పాఠశాలలో తనకు ఉన్న తొమ్మిదేళ్ల అనుబంధాన్ని ఆయన ప్రత్యేకంగా నెమరువేసుకున్నారు. నాడు తన వద్ద చదువుకున్న విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో స్థిరపడటం, కొందరు ప్రభుత్వ ఉద్యోగులుగా, సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా సేవలందించడం తనకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. గురువు బోధన కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, మానవత్వం, నిజాయితీ, బాధ్యత మరియు సమాజం పట్ల గౌరవం వంటి విలువలను నేర్పాలని సూచించారు. తరగతి గదిలో చెప్పిన ఒక్క మంచి మాట కూడా విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థి ఏ స్థాయికి ఎదిగినా తన ఎదుగుదలకు పునాది వేసిన గురువును మాత్రం ఎప్పటికీ మరిచిపోడని రాజశేఖర్ శెట్కార్ అన్నారు. ఒకప్పుడు తమ ముందు బెంచీల్లో కూర్చొని పాఠాలు విన్న విద్యార్థులు నేడు ఉన్నత హోదాల్లో ఉన్నప్పటికీ గురువు కనిపించగానే గౌరవించడం ఉపాధ్యాయ వృత్తికి దక్కే అరుదైన గౌరవమని పేర్కొన్నారు. సృష్టిలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నప్పటికీ భావితరాలను తీర్చిదిద్దే మహోన్నత బాధ్యత గురువుకే దక్కుతుందని తెలిపారు. గురువు తన జీవితాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు అంకితం చేస్తే ఆ సేవకు లభించే గౌరవం ఏ పదవికీ దక్కదన్నారు. విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికితీయడం, వెనుకబడిన విద్యార్థికి అండగా నిలవడం, తప్పు చేసినప్పుడు సరిదిద్దడం ప్రతి గురువు బాధ్యత అని చెప్పారు. చదువంటే కేవలం పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం కాదని, మంచి మనిషిగా ఎదగడం, తల్లిదండ్రులను గౌరవించడం మరియు సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తయారవడం కూడా విద్యలో భాగమేనని స్పష్టం చేశారు.
బోరంచ పాఠశాలలో తాను పనిచేసిన రోజుల్లో విద్యార్థులతో ఏర్పడిన అనుబంధం తన జీవితంలో చెరగని జ్ఞాపకంగా నిలిచిపోయిందని రాజశేఖర్ శెట్కార్ భావోద్వేగంతో తెలిపారు. తాను బోధించిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగడం చూస్తుంటే ఒక గురువుగా తనకు లభించిన గొప్ప బహుమతి అదేనని అన్నారు. గురువు వేసే ప్రతి అడుగు విద్యార్థి భవిష్యత్తుకు బలమైన బాట వేస్తుందని చెప్పారు. ప్రతి ఉపాధ్యాయుడు తన వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సమాజ నిర్మాణ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఒక మంచి గురువు వందలాది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేయగలడని, ఆ విద్యార్థులు భవిష్యత్తులో వందల కుటుంబాలకు, సమాజానికి ఉపయోగపడే స్థాయికి ఎదుగుతారని అన్నారు. అందుకే గురువు చెప్పే ప్రతి మాటలో విలువ ఉండాలని, చేసే ప్రతి పనిలో ఆదర్శం కనిపించాలని సూచించారు.