ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ తిరునగిరి రఘు పదవీ విరమణ సన్మాన సభ
సూర్య తెలంగాణ డెస్క్: ఏటూరునాగారం డివిజన్ ఐటీడీఏ మీటింగ్ హాల్‌లో ఐటీడీఏ ఏపీఓ తిరునగిరి రఘు పదవీ విరమణ సన్మాన మహోత్సవ సభ అత్యంత వేడుకగా మరియు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ విట్సల్ టోప్పో హాజరై సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వయస్సు కంటే రఘు గారి అనుభవాలు చాలా గొప్పవని, ఇక్కడికి వచ్చాక ఎలాంటి సమస్యలు లేవని ప్రశంసించారు. గతంలో మాన్యువల్ పద్ధతుల్లో ఉండే ఇబ్బందులు ఇప్పుడు సాంకేతిక వ్యవస్థ రావడం వల్ల తొలగిపోయాయని, పనులు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. ఉద్యోగ బృందం బాధ్యతగా సహకరిస్తేనే ట్రైబల్ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తోటి సహోద్యోగులు, ఉద్యమ నాయకులు, తుడుం దెబ్బ నాయకులు మరియు మహిళా ఉద్యోగులు అందరూ మాట్లాడుతూ గిరిజన ఏజెన్సీ మరియు ఆదివాసీల సమస్యల పరిష్కారంలో శ్రీ టీవీఆర్ దామోదర్ స్వామి అలియాస్ రఘు అందించిన సేవలను కొనియాడారు. ఆయన సతీమణి తిరునగిరి పద్మజ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత శేష జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. సమ్మక్క సారలక్క వనదేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని దీవించారు. చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ముద్దుబిడ్డగా గుర్తింపు పొందిన రఘును హన్మకొండ, వరంగల్ జిల్లా కార్యకర్తలు దాస్యం అప్పనాధ స్వామి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రంగనాథ స్వామి తదితరులు ఘనంగా సన్మానించారు. ఉద్యోగ, కుల సంఘాల మహిళలు తమ కవితల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతూ జ్ఞాపికలు అందజేశారు.
చివరగా పదవీ విరమణ పొందిన శ్రీ రఘు మాట్లాడుతూ తాను చిన్న స్థాయి నుంచి పెద్ద పదవి వరకు ఎదిగానని గుర్తు చేసుకున్నారు. అడవి ప్రాంతం గిరిజనుల సమస్యలు, బాగోగులు చూసేందుకు సమ్మక్క సారలక్క దీవెనలతో ముప్పై ఎనిమిదేళ్ల పాటు సేవ చేశానని తెలిపారు. గతంలో మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి నుంచి నేడు ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. మేడారం మహా సమ్మక్క జాతర సమయంలో నాలుగు నెలల పాటు రేయింబవళ్లు సిబ్బంది అందరూ కలిసికట్టుగా పని చేశామని, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఎలాంటి సమస్యలు రాకుండా విధులు నిర్వర్తించామని తెలిపారు. తన ఉద్యోగ ప్రయాణం దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రఘు దంపతులను శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.