BREAKING
మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ కలిసుందాం టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం

కలిసుందాం

Select Suryaa Now
కలిసుందాం

*కలిసుందాం..!*
కూటమికి మచ్చ తేవద్దు.. స్థానిక పోరులో క్లీన్‌స్వీపే లక్ష్యం

* అసెంబ్లీ తీర్పును రిపీట్ చేయాలి.. వైరిపక్షానికి ఒక్క సీటూ దక్కడానికి వీల్లేదు
* గత పాలకుల అరాచకాలకు చెక్.. పల్లె, పట్టణాల్లో సంపూర్ణ ప్రజాస్వామ్య విజయం సాధించాలి
* బూత్ స్థాయి కార్యకర్తలే పట్టుగొమ్మలు.. వారే అసలైన గెలుపు గుర్రాలు
* ఆశావహులు ఎక్కువైనా సమన్వయమే ముఖ్యం.. సొంత కుంపట్లు పెడితే వేటు తప్పదు
* సమస్యలొస్తే తలుపులు వేసి కమిటీలోనే తేల్చాలి: కాకినాడ భేటీలో మంత్రి నారాయణ హెచ్చరిక
ఐక్యతే అసలైన బలం

అసెంబ్లీలో సాధించిన చారిత్రక విజయాన్ని స్థానిక సంస్థల సమరంలోనూ పునరావృతం చేయాలని కూటమి శంఖారావం పూరించింది. గత పాలకుల అరాచకాలను తుడిచిపెడుతూ పల్లె నుంచి పట్టణం దాకా సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని పిలుపునిచ్చింది. ఈ కీలక పోరులో సీట్ల కోసం, ఆధిపత్యం కోసం కుమ్ములాడుకుని కూటమి ప్రతిష్ఠకు మచ్చ తేవద్దని హెచ్చరించింది. ఎన్ని లెక్కలున్నా ముగ్గురం కలిసే కదలాలని, విభేదాలుంటే నాలుగు గోడల మధ్యే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. బుధవారం కాకినాడ తెదేపా కార్యాలయంలో జరిగిన సమన్వయ భేటీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ శ్రేణులకు ఈ దిశానిర్దేశం చేశారు....

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో

సార్వత్రిక ఎన్నికల్లో 164 స్థానాలతో సాధించిన చారిత్రక విజయాన్ని స్థానిక సమరంలోనూ పునరావృతం చేయాలని కూటమి నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల పేరిట సాగిన అరాచకాలు, బెదిరింపులకు చరమగీతం పాడి, సంక్షేమం మరియు అభివృద్ధిని నమ్ముకుని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి స్థానాన్నీ గెలుచుకోవాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టికెట్ల కోసం, ఆధిపత్యం కోసం కుమ్ములాడుకుని కూటమి ప్రతిష్ఠకు మచ్చ తేవద్దని, ముగ్గురం కలిసే ఉండాలని, కలిసే కదలాలని బుధవారం కాకినాడ జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ఎన్డీయే సమన్వయ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
కాకినాడ వేదికగా వ్యూహాత్మక మథనం
త్వరలో జరగనున్న పంచాయతీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లా కూటమి వ్యూహరచనకు కాకినాడ వేదికైంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ, తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎన్నికల ఇన్‌ఛార్జి సుజయ్‌‌కృష్ణ రంగారావుల సమక్షంలో మూడు పార్టీల ముఖ్య నేతలు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, స్థానిక సమరాన్ని ఏకపక్షం చేయడమే ఏకైక లక్ష్యం కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
క్షేత్రస్థాయి కార్యకర్తలే పట్టుగొమ్మలు
ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీతో పాటు గ్రామీణ స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థులే గెలిచేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని నేతలు నిర్ణయించారు. తెదేపా, జనసేన, భాజపా మూడు పార్టీల బూత్ స్థాయి కార్యకర్తలే క్షేత్రస్థాయిలో కూటమికి అసలైన బలమని కొనియాడారు. కిందిస్థాయి శ్రేణులు ఇచ్చే సమగ్ర క్షేత్ర నివేదికలు, వారి ఐక్యతే అంతిమ గెలుపును నిర్దేశిస్తాయని స్పష్టం చేశారు.
సొంత కుంపట్లపై క్రమశిక్షణ వేటు
అధికార పార్టీలో స్థానిక ఎన్నికల వేళ ఆశావహుల తాకిడి తీవ్రంగా ఉండటం సహజమేనని, అయితే టికెట్ల కేటాయింపు ప్రక్రియలో అసంతృప్తులు తలెత్తితే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగపరచవద్దని మంత్రి నారాయణ హెచ్చరించారు. సీట్ల సర్దుబాటుపై ఎక్కడైనా సమస్య వస్తే నాలుగు గోడల మధ్యే చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, మీడియా ముందుకు వెళ్లినా లేదా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి కూటమి పరువు తీసినా క్రమశిక్షణ వేటు తప్పదని తేల్చిచెప్పారు.
సంక్షేమాస్త్రాలతో క్లీన్‌స్వీప్ దిశగా..
వ్యక్తిగత ప్రతిష్ఠల కంటే గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్ దక్కుతుందని, అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థి ఏ పార్టీ వారైనా మిగిలిన రెండు పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్ల పెంపు, దీపం పథకం, నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గడపగడపకూ తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది. స్థానిక సంస్థల పాలనను కూడా సంపూర్ణంగా చేజిక్కించుకుంటేనే పల్లెలు, పట్టణాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఓటర్లకు వివరించాలని, క్రమశిక్షణతో కూడిన సమన్వయంతో సాగితే జిల్లాలో క్లీన్‌స్వీప్ తథ్యమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.