వైద్య సేవలు మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశం
సూర్య తెలంగాణ డెస్క్: పశు సంపద రక్షణ ద్వారానే రైతులకు నిజమైన ఆర్థిక భరోసా లభిస్తుందని, పశువులకు సకాలంలో వైద్య సేవలు మరియు టీకాలు అందించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు. జిల్లాలోని నందివడ్డేమాన్ ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో కొనసాగుతున్న ఫెర్టిలిటీ క్యాంప్‌ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అందిస్తున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమం అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు అందుతున్న పశువైద్య సేవల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు, ముద్ద చర్మ వ్యాధి, జబ్బ వ్యాధి మరియు గొంతువాపు నివారణకు వేస్తున్న టీకాల వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్ని పశువులకు టీకాలు వేశారు, ఇంకా ఎన్ని పశువులకు వేయాల్సి ఉందనే విషయాలను ఆరా తీశారు.
పశువులకు ఏ చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని, వ్యాధులు ఇతర పశువులకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. క్యాంప్‌కు వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వైద్యులు సమయానికి అందుబాటులో ఉంటున్నారా లేదా అని వివరాలు తెలుసుకున్నారు. పశుసంపద రైతుల జీవనోపాధికి అత్యంత ముఖ్యమైన ఆధారమని, పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సకాలంలో టీకాలు వేయడం ద్వారా ప్రాణాంతక అంటువ్యాధులను విజయవంతంగా నియంత్రించవచ్చని సూచించారు. గ్రామాల్లో పశువుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అర్హత కలిగిన పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలను సకాలంలో అందించాలని తెలిపారు.
పశువుల పూర్తి వివరాలు, టీకాలు, వైద్య సేవలు మరియు కృత్రిమ గర్భధారణ తదితర అంశాలన్నింటిని రికార్డులలో పద్ధతిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పశువైద్య కేంద్రాలకు వచ్చే ప్రతి రైతుకూ ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన సేవలు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో, సర్పంచ్ తిప్పిరెడ్డి సుగుణమ్మతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యులు, సిబ్బంది మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.