స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి లెంక సుడిగాలి ప్రచారం
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి లెంక అప్పలనాయుడు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. జరజాపుపేట పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం ఆయన ఇంటింటికీ తిరుగుతూ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను నేరుగా కలుస్తూ.. తనకు 'ఉంగరం' గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గత 40 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్యే ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తున్నానని, చైర్మన్‌గా గెలిపిస్తే పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు వంటి వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, వారి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచేశారు. అలాగే పట్టణ వాసులకు శ్మశాన వాటిక సమస్య పరిష్కరిస్తానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు అవనాపు సత్యనారాయణ, కింతాడ కళావతి, నల్లి బంగారు చంద్రశేఖర్, కాళ్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.