స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి ఆరు జాతీయ అవార్డులు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఈ ఏడాది రాష్ట్రానికి ఏకంగా ఆరు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. గత ఏడాది 78 అవార్డుల్లో ఐదు అవార్డులు సాధించిన ఏపీ,ఈసారి మొత్తం 60 అవార్డుల్లో ఆరు అవార్డులు కైవసం చేసుకుంది. దీంతో జాతీయ స్థాయిలో రాష్ట్రం సాధించిన అవార్డుల శాతం 12.5 నుంచి 25 శాతానికి పెరిగిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బుధవారం వెల్లడించారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, కుప్పం నగరాలకు ఈ అవార్డులు దక్కాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తొలగింపు, వ్యర్థాల శుద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 153 లక్షల టన్నుల పాత వ్యర్థాలను తొలగించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు వివరించారు. చెత్త ప్రాసెసింగ్ కోసం 106 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వగా, ఇప్పటికే 60 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని, మరో 26 ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణాన్ని వచ్చే ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ప్రతి మున్సిపాలిటీలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని, గ్రీనరీ అభివృద్ధికి హెచ్ఏఎం ప్రాజెక్టు కింద రూ.900 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పట్టణాభివృద్ధికి రూ.50 వేల కోట్లతో వివిధ పనులు చేపడుతున్నామని, రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలను రాబోయే రెండేళ్లలో స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు.