స్వచ్ఛ రథంతో పరిశుభ్రతపై అవగాహన
బాడంగి, సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్): బాడంగి మండలం ముగడ గ్రామ పంచాయతీ పరిధిలోని ముగడ, న్యూ కాలనీల్లో బుధవారం స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో స్వచ్ఛ రథం తిరుగుతూ ప్రజల నుంచి పొడి చెత్తను సేకరించి, దానికి అనుగుణంగా నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి.వి. శ్రీలత, డిప్యూటీ ఎంపీడీవో బాలదొర, భీమవరం, ముగడ గ్రామ పంచాయతీల కార్యదర్శులు బంగారు బాబు, వై. సూర్యారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎక్కువ మొత్తంలో పొడి చెత్తను సేకరణకు అందించిన వారికి ఎంపీడీవో శ్రీలత చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీలత మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంటి వద్దే చెత్తను వేరు చేసి, పొడి చెత్తను బిన్ బ్యాగ్ విధానంలో అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు.