స్థానిక సంస్థల ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
• గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి • నాయకుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి • స్థానిక ఎన్నికల్లో మన వాళ్లకు తగిన సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి • గిరిజన గ్రామాల అభివృద్ధిని గత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది • ప్రజా అవసరాలను విస్మరించి.. పార్టీ రంగుల కోసం వందల కోట్ల ఖర్చు చేసింది • రాజకీయాలకు అతీతంగా గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయించాము • రహదారులు, ఉపాధి, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నాం • అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం • రంపచోడవరం నియోజకవర్గం కాకవాడ గ్రామసభలో కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, వారి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు, విజయం కోసం మన పార్టీ నాయకులు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలను గుర్తిస్తూ పొత్తు ధర్మానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మన నాయకుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం, కూటమి కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా కూటమిలోని ప్రతి నాయకుడు అండగా నిలవాలని కోరారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కాకవాడలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “2014లో కూటమికి మద్దతుగా నిలిచినప్పుడు ఏ ఒక్కరూ పదవులూ ఆశించలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి నిస్వార్థంగా పని చేశారు. పార్టీ కోసం, కూటమి కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ఎన్నో త్యాగాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా మన వాళ్ళు, వీరమహిళలు తమ సంఘీభావాన్ని చాటారు. కష్టకాలంలో అండగా నిలిచిన వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ మన పార్టీ నాయకులకు, వీరమహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. వారి త్యాగాలకు తగిన గౌరవం లభించాలి. పదవులు ఆశించకుండా అండగా నిలిచిన వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. *అడవితల్లి బాట లక్ష్యం అదే* గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి, వాటిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రహదారుల నిర్మాణం ద్వారా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పీఎం-జన్మన్, పీఎంజీఎస్‌వై-4, ఉపాధి హామీ పథకాల సమన్వయంతో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద 858 గిరిజన ఆవాసాలకు 1,662 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రూ.1,406 కోట్లతో పనులు చేపట్టాం. ఇదే స్ఫూర్తితో అడవితల్లి బాట 2.0 ద్వారా మరో 1,341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు, 45 వంతెనల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లతో మొత్తం 2,569 పనులను మంజూరు చేశాం. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంగా ఉన్నాయో అర్థం చేసుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాం. అయితే, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం సాధారణ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. కొండల మధ్య కిలోమీటర్ల మేర మార్గాలను ఏర్పాటు చేయడంతోపాటు, భారీ బండరాళ్లను తొలగించాలి. అవసరమైన చోట రాక్ కట్టింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్ చేపట్టాలి. కొండ వాలులను స్థిరపరిచి, రహదారికి పటిష్ఠమైన పునాది వేసిన తర్వాత గ్రావెల్, ఇతర పొరలను ఏర్పాటు చేసి బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. *83 వేల మంది రైతులకు లబ్ధి* గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించి, వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధి హామీ, వీబీ-జీ రామ్ జీ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85 వేల ఎకరాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి, సుమారు 83 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ సాగును ప్రోత్సహించడంతో పాటు, కాఫీ తోటలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ వంటి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. అలాగే, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సుంకరమెట్ట కాఫీ తోటల్లో వుడెన్ బ్రిడ్జి, కానోపీ వాక్‌లను నిర్మించాం. మారేడుమిల్లిలో 11 హెక్టార్ల విస్తీర్ణంలో అరోమా కానోపీ వాక్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నాం. నల్లమలలో జంగిల్ సఫారీని అభివృద్ధి చేయడం ద్వారా చెంచు గిరిజన కుటుంబాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో నివసించే బంజారా, యానాది, యెరుకుల గిరిజన ఆవాసాలకు కూడా రహదారి సౌకర్యం కల్పిస్తున్నాం. పల్లెపండుగ కార్యక్రమం కింద ఇప్పటికే 167 ఆవాసాలకు 111 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించాం. పల్లెపండుగ 3.0 ద్వారా మరో 84 ఆవాసాలకు 63.4 కిలోమీటర్ల రహదారుల నిర్మాణ పనులు చేపట్టాం. అలాగే, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో సీఎస్‌ఆర్ నిధులతో 25 అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద రూ.406 కోట్లతో 3,776 సింగిల్ విలేజ్ స్కీమ్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తంగా పల్లెపండుగ కార్యక్రమం ద్వారా సుమారు రూ.7,481 కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం. *రహదారులు, మొబైల్ కనెక్టివిటీకి అనుమతులు* గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మొబైల్ కనెక్టివిటీ, పర్యాటక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, గిరిజన కుటుంబాల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అటవీ శాఖ నుంచి 555 రహదారి పనులు, 136 సెల్ టవర్ల ఏర్పాటు, 48 ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు మంజూరు చేశాం. మిగిలిన అటవీ అనుమతులు కూడా త్వరితగతిన లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. అరకులోని డుంబ్రిగుడ, కురిడి గ్రామాలను సందర్శించినప్పుడు సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వారితో పాటు, తీవ్రమైన రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్న గిరిజన గర్భిణుల ఇబ్బందులను గుర్తించాం. అత్యవసర సమయాల్లో వారికి సకాలంలో రక్తం అందించాలనే లక్ష్యంతో అరకు ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.కోటి సీఎస్ఆర్ నిధులతో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును నిర్మిస్తున్నాం. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కంపోనెంట్ కింద రూ.68 కోట్లతో చేపట్టిన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 59 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల పరిధిలో 34 వేల మందికి పైగా అర్హులైన రైతులకు 38 రకాల, 3 లక్షలకు పైగా వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేయనున్నాం. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నాం. *స్థానిక సమస్యల పరిష్కారానికి ఆదేశాలు* వేములకొండ, రాకోట, సువర్లవాడ, దారగూడెం, దబ్బబయలస, తిరుగతిరళ్ళు, కాకవాడ, చకలవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం గ్రామాల ప్రజలతో నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలో స్థానికులు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన సమస్యలు, అవసరాలను నా దృష్టికి తీసుకువచ్చారు. వాటన్నింటినీ మంజూరు చేస్తూ, సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టి, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశిస్తున్నాను. గిరిజనుల హక్కులను గౌరవిస్తూ, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, అడవులను కాపాడే వారి జీవితాల్లో వెలుగులు నింపి, అభివృద్ధి ఫలాలను ప్రతి గిరిజన ఆవాసానికి చేర్చడమే కూటమి ప్రభుత్వ సంకల్పం. *పార్టీ రంగులు వేసుకోవడానికి కోట్లు ఖర్చు చేశారు* 2019–2024 మధ్య రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయో మనందరికీ తెలుసు. మన కళ్లముందే గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను శిలాఫలకాల ఏర్పాటు కోసం, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం కోసం, కోర్టుల ఆదేశాల తర్వాత ఆ రంగులను తొలగించి మళ్లీ కొత్త రంగులు వేయడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదే నిధులను సద్వినియోగం చేసి ఉంటే ఎన్నో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు. మనం నిర్మిస్తున్న రహదారులు నాణ్యతతో ఉన్నాయా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రజలపై ఉంది. కేవలం రోడ్లు వేయించడమే కాదు, అవి నాణ్యతతో నిర్మితమై, ఎక్కువకాలం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. ఎక్కడైనా నాణ్యతలో లోపాలు కనిపిస్తే వాటిని మా దృష్టికి తీసుకురండి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు సంపూర్ణ సహకారం అందిస్తే, మరింత బాధ్యతతో, మరింత ధైర్యంతో ముందుకు సాగగలం. ప్రతిపక్ష మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం. మేము అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రతిపక్ష మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా అవసరమైన నిధులు అందేలా చర్యలు తీసుకున్నాను. ఎందుకంటే నాకు ముఖ్యమైన విషయం - ఏ పార్టీ బతకాలి అనేది కాదు వ్యవస్థ బతకాలి, గ్రామాలు బాగుపడాలి, ప్రజల జీవితాలు మెరుగుపడాలి. వ్యవస్థ బలంగా ఉంటేనే గ్రామాలకు రహదారులు వస్తాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజలకు జీవనోపాధి మెరుగుపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. అందుకే రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎక్కడికక్కడ లంచాలు తీసుకుంటూ, ఆధిపత్య అహంకారంతో ప్రజలను భయపెట్టే పరిస్థితులు ఉండకూడదు. తప్పును ప్రశ్నించే ధైర్యం ప్రజలకు ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను కూడా గుర్తించాలి. ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి” అన్నారు.