స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయం.. ప్రజలకు భానుశ్రీ భరోసా
నెల్లూరు మేజర్ న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ముందుకు సాగుతున్నారు. నెల్లూరు నగరంలోని 56వ డివిజన్ రాజీవ్ స్వగృహ ప్రాంతంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి వీధి దీపాల వెలుతురుకు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా పాముల సంచారం పెరిగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. స్థానికుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన భానుశ్రీ మున్సిపల్ అధికారులతో మాట్లాడి టిప్పర్, చిన్న జేసీబీ సహాయంతో చెట్లు, పొదలను తొలగించి రహదారులను శుభ్రం చేయించారు. అలాగే పలు ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ధ్యేయమని భానుశ్రీ చాటిచెప్పారు.