స్థానిక ఎన్నికలకు జనసేన సమరశంఖం..
స్థానిక ఎన్నికలకు జనసేన సమరశంఖం..
రంగంలోకి పవన్ ప్రత్యేక టీమ్‌లు !
-పార్లమెంట్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు
జనసేన ఎన్నికల కసరత్తు.. ప్రత్యేక కమిటీల ఏర్పాటు
-స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత ప్రత్యేక వ్యూహం
-పార్లమెంట్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వరకు అడహాక్ కమిటీలు
-క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆశావహుల వివరాల సేకరణకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
-ఎన్నికల నిర్వహణ, కూటమి సమన్వయం, ప్రచారం కోసం మరో నాలుగు కేంద్ర కమిటీలు
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో పార్టీ బలమైన పాత్ర పోషించేలా క్షేత్రస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఎన్నికల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ సంస్థాగత బలం, స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ఆశావహ అభ్యర్థుల వివరాలు, కూటమి సమన్వయంపై సమగ్ర సమాచారాన్ని సేకరించి ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం.
పార్లమెంట్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రత్యేక నెట్‌వర్క్
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు జనసేన పార్టీ పార్లమెంటరీ అడహాక్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి కమిటీలో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నాయకులతో పాటు, ఆ పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున నాయకులను నియమించేలా కార్యాచరణ రూపొందించారు. కమిటీలకు సహకరించేందుకు నిర్వాహక దళ్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాలు గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నాయకుల పనితీరు, జనసైనికుల చురుకుదనం, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహుల వివరాలను సేకరించనున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా పార్టీ ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడం ఈ ప్రక్రియలో కీలకంగా మారనుంది.
కమిటీలపై పవన్ కల్యాణ్ స్వీయ పర్యవేక్షణ
ఈ కమిటీలు సేకరించే సమాచారాన్ని ఇటీవల నియమించిన ఐదుగురు సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీకి అందజేయనున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో రూపొందే నివేదికలను కేంద్ర కమిటీ సమీక్షించి, సమగ్ర నివేదికల రూపంలో పవన్ కల్యాణ్‌కు సమర్పిస్తుంది. కమిటీల పనితీరును పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించడంతో పాటు, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీ సభ్యులతో సమావేశమై ఎన్నికల కసరత్తు, సంస్థాగత సన్నద్ధత, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ అడహాక్ కమిటీలు కొనసాగనున్నాయి.
మరో నాలుగు కేంద్ర కమిటీలు.. కూటమి సమన్వయానికి ప్రాధాన్యం
స్థానిక ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పార్లమెంటరీ కమిటీలతో పాటు మరో నాలుగు కేంద్ర కమిటీలను జనసేన ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణ, మార్గదర్శక కమిటీతో పాటు కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను నియమించారు. ఎన్నికల వ్యూహాల అమలు, కూటమి భాగస్వాములతో సమన్వయం, ప్రచార కార్యక్రమాల రూపకల్పన, ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఈ కమిటీలు కీలక బాధ్యతలు చేపట్టనున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలను సెంట్రల్ సపోర్ట్ టీమ్ ద్వారా పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఆయా ప్రాంతాలకు నిర్వాహక్ దళ్‌ను మాత్రమే నియమించాలని నిర్ణయించారు. విజయవాడ పార్లమెంట్ కమిటీ మినహా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు కమిటీల నియామకంపై ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలకు ముందస్తు సన్నద్ధతే ప్రధాన లక్ష్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన పాత్ర పోషించేలా నాయకులు, కార్యకర్తలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడమే ఈ కార్యాచరణ వెనుక ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పార్టీ బలాబలాలను అంచనా వేయడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం, కూటమి భాగస్వాములతో కలిసి ముందుకు సాగడం వంటి అంశాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, కేంద్ర సమన్వయ కమిటీ సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, పీవీఆర్ ప్రశాంత్, యనమల భాస్కర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి సమాచార సేకరణతో జనసేన ఎన్నికల సన్నద్ధతకు కొత్త ఊపు తీసుకురావాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.