స్నేహితురాలి కోసం ప్రాణాలకు తెగించిన బాలిక లక్ష్మి ధైర్యం ఆదర్శనీయం
చిన్నారి ధైర్యసాహసాలకు మంత్రి నారా లోకేష్ ప్రశంసలు
స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాటం
బాధిత బాలికలకు మెరుగైన వైద్యం.. కుటుంబాలకు ప్రభుత్వం అండ
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
రాప్తాడులో పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అదే ఘటనలో తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన మరో బాలిక లక్ష్మి ధైర్యసాహసాలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. రంపంతో పాఠశాలలోకి ప్రవేశించిన దుండగుడు దాడికి పాల్పడిన సమయంలో లక్ష్మి భయపడి పారిపోకుండా స్నేహితురాలికి రక్షణగా నిలబడిందని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్నేహితురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో లక్ష్మి కూడా తీవ్రంగా గాయపడిందని పేర్కొన్నారు. తనను తాను రక్షించుకునే అవకాశం ఉన్నా స్నేహితురాలి ప్రాణాలకే ప్రాధాన్యమిచ్చిన లక్ష్మి నిజమైన స్నేహానికి, అసలైన ధైర్యసాహసాలకు నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించారు. ప్రస్తుతం ఇద్దరు బాలికలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇద్దరు విద్యార్థినులకు అత్యుత్తమ వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ చిన్నారికీ తరగతి గదిలో భయపడాల్సిన పరిస్థితి రాకుండా పాఠశాలల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేస్తామని వెల్లడించారు. గాయపడిన ఇద్దరు బాలికలు త్వరగా కోలుకుని మళ్లీ చిరునవ్వులతో పాఠశాలకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.