సంగం మండలం ఉపాధ్యాయుడి ప్రతిభకు ఘన సత్కారం
సంగం మేజర్ న్యూస్ : సంగం మండలంలోని మక్తాపురం గ్రామానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు తాటిపర్తి వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రామరాజు ఫౌండేషన్, నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం గుంటూరు నగరంలోని ఎస్‌హెచ్‌ఓ మీటింగ్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి వెంకటేశ్వర్లు పాల్గొని “ప్రపంచ తపాలా దినోత్సవం–ఉత్తరాల ప్రాముఖ్యత” అనే అంశంపై కవితాగానం చేసి ప్రథమ స్థానాన్ని సాధించారు.
ఈ సందర్భంగా భారత తపాలా శాఖ ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు, కవర్లు, పోస్టుకార్డులను సభలో ప్రదర్శించి వాటి విశిష్టత, ప్రాముఖ్యతలను వివరించారు. ఆయనకు నిర్వాహకులు అభినందనలు, మన్ననలు తెలిపారు. తపాలా శాఖ విడుదల చేసిన స్టాంపులు, కవర్లను సేకరించడం మంచి అలవాటని కొనియాడారు. ప్రతిభ కనబరిచిన తాటిపర్తి వెంకటేశ్వర్లును ప్రత్యేకంగా నగదు బహుమతి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే “మల్లెతీగ” సాహిత్య పత్రికను ఏడాది పాటు ఉచితంగా పోస్టు ద్వారా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరావు, మల్లెతీగ సాహిత్య పత్రిక సంపాదకులు కలిమిశ్రీ, రాష్ట్ర ప్రభుత్వ బోయి భీమన్న పురస్కార గ్రహీత భూసురుపల్లి వెంకటేశ్వర్లు, నవ్యాంధ్ర రచయితల సంఘం నిర్వాహకులు బండికల్లు జమదగ్ని, సయ్యద్ జానీభాష, పట్టాభి కళాపీఠం అధ్యక్షుడు తూములూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.