శభాష్ పోలీస్.. సమన్వయంతో సేవలు భేష్
90 ఏళ్ల తర్వాత జరిగిన పోలేరమ్మ జాతర ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్.ఐ పనితీరుపై ప్రశంసలు.. అన్ని శాఖల సమష్టి కృషి
పొదలకూరు, మేజర్ న్యూస్ : తొమ్మిది దశాబ్దాల తర్వాత వైభవంగా నిర్వహించిన పొదలకూరు శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అందించిన సేవలు అభినందనీయంగా నిలిచాయి. మూడు రోజుల పాటు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాతరను ప్రశాంతంగా నిర్వహించడంలో ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పొదలకూరు సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై శివ రాకేష్ కీలక పాత్ర పోషించారు.
పక్కా ప్రణాళిక.. పటిష్ట బందోబస్తు : జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని ముందుగానే అంచనా వేసిన పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ లో అనుభవమున్న సీఐ గుత్తి వెంకట్రావు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాపూరు, కలువాయి, నెల్లూరు మార్గాల నుంచి వచ్చే వాహనాలు పట్టణంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గాయి. జాతర ప్రారంభం నుంచి ఉత్సవాల ముగింపు వరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
సామాన్య భక్తులకు త్వరిత దర్శనం వీఐపీల దర్శన ఏర్పాట్లతో పాటు సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం త్వరగా పూర్తయ్యేలా పోలీసులు, జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ఎక్కడా తొక్కిసలాటకు, గందరగోళానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కుమ్మరి ఇంటి నుంచి చాకలి మాన్యానికి అమ్మవారి ప్రతిమను తీసుకువచ్చే సందర్భంలోనూ, అక్కడి నుంచి ఆలయానికి తీసుకెళ్లే ఊరేగింపులోనూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. వేలాదిమంది పాల్గొన్న గ్రామోత్సవంలోనూ ట్రాఫిక్, భద్రతా నిర్వహణను సమర్థంగా కొనసాగించారు.
అన్ని శాఖల సమష్టి కృషి : జాతర విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖతో పాటు ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, గ్రామపంచాయతీ, ఎంపీడీవో కార్యాలయం, ఆర్‌డబ్ల్యూఎస్, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సేవలు కూడా కీలకంగా నిలిచాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ట్రాన్స్‌కో డీఈ, సిబ్బంది చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పంచాయతీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందించింది.
అలుపెరుగని సేవలకు అభినందనలు : మూడు రోజుల పాటు నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ భక్తుల భద్రతకు ప్రాధాన్యమిచ్చిన పోలీసు సిబ్బంది సేవలు ప్రశంసనీయం. ముఖ్యంగా సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై శివ రాకేష్ పర్యవేక్షణలో చేపట్టిన చర్యలు జాతర ప్రశాంతంగా సాగేందుకు దోహదపడ్డాయి. ఒకవైపు భక్తుల రద్దీని నియంత్రిస్తూ, మరోవైపు ఉత్సవాల సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం విశేషం.భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పోలేరమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది, జాతర కమిటీ సభ్యులు అందించిన సేవలు స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి.