సరస్వతీ దేవి అలంకారంలో భువనేశ్వరి అమ్మవారి కనువిందు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు నగరం మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్టి (శుక్రవారం) పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ భువనేశ్వరి అమ్మవారు చదువుల తల్లి ‘శ్రీ సరస్వతీ దేవి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించి, 7 గంటలకు శాస్త్రోక్తంగా నవావరణ పూజ జరిపించారు. ఈ పూజా కార్యక్రమానికి గాలి చంద్రశేఖర్, సుభాషిని దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సామూహిక చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సాయంత్రం సరస్వతీ దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం కన్నులపండువగా సాగింది. ఈ ఉత్సవానికి దేవిశెట్టి శ్రీహరి, వెంకట సుదర్శనమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఇదే సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీ సాయి లలిత నృత్య నికేతన్ కళాకారులచే నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు