సహకార గృహ నిర్మాణ సంఘం చైర్మన్గా భోగిరెడ్డి ఓబుల్ రెడ్డి బాధ్యతల స్వీకారం
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు సహకార గృహ నిర్మాణ సంఘం నూతన పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన చైర్మన్గా భోగిరెడ్డి ఓబుల్ రెడ్డి, పాలకవర్గ సభ్యులుగా భోగాల నాగిరెడ్డి, కసినేపల్లి శ్రీనివాసులు, వద్ది ఓబులేసు, లింగందిన్నె చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శిగా పోతురాజు విష్ణువర్ధన్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు సహకార గృహ నిర్మాణ సంఘం స్థాపించి 76 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సంఘంలో సుమారు 12 వేల మంది సభ్యులు ఉన్నారని, సంఘం ఆధ్వర్యంలో మూడు కాలనీలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. సభ్యులకు అవసరమైన ఋణాలను సంఘం ద్వారా మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అవకతవకలతో కూడిన గత పాలకవర్గాన్ని రద్దు చేసి నూతన కమిటీని నియమించినట్లు తెలిపారు. నూతన పాలకవర్గం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేసి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన చైర్మన్ భోగిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘానికి మంచి వనరులు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సంఘంలోని సభ్యుల ఖాతాలు, లావాదేవీలు, ఇతర వివరాలను కంప్యూటరీకరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంఘానికి రావాల్సిన మొండి బకాయిలను త్వరితగతిన వసూలు చేసి ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. గతంలో ఉన్న పరిస్థితులను అధిగమించి నూతన విధానాలతో సంఘం కార్యకలాపాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.తనకు ఈ అవకాశం కల్పించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ప్రొద్దుటూరు జడ్పీటీసీ సభ్యులు బచ్చల వీర ప్రతాప్, మార్కెట్ యార్డు ఇన్ఛార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్, పలువురు నాయకులు, కార్యకర్తలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- ప్రతాప్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా