రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ -శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు -అల్లర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిక చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో శాంతిభద్రతలను కట్టుదిట్టంగా పరిరక్షించేందుకు జిల్లా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, అనుమానితులు, గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తులకు పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురిచేయడం, గొడవలు సృష్టించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టంగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో హింస, బెదిరింపులు, అల్లర్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై ఆధారాలతో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్