రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
రక్తం లభించక ఏ ఒక్క ప్రాణం పోకూడదని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఎంసీ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏఎస్పి(సెంట్రల్) తరుణ్ పహ్వతో కలిసి ఆయన స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ.. రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సకాలంలో రక్తం లభించకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అలాగే అనేక మంది రక్త హీనతతో భాదపడుతున్నారని.. తలసీమియా వ్యాధికి గురైన వారి ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందన్నారు. కనుక రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 65 సంవత్సరాల వరకూ రక్తాన్ని దానం చేయవచ్చని పేర్కొన్నారు. 3 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వివరించారు. రక్తదానం చేయడం వల్ల దానం చేసినవారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయని, గుండెపోటు రాదని, బీపీ నియంత్రణలో వుంటుందన్నారు. కనుక ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, డాక్టర్ పరాశర, గన్ని మహాలక్ష్మి (రాజమండ్రి రెడ్ క్రాస్ కోశాధికారి), తదితరులు పాల్గొన్నారు