పారిశ్రామిక వాడ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
దుద్యాల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12): మండల పరిధిలోని సంట్రకుంట తండా, నాణ్య నాయక్ తండా గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూములను టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా 88వ సర్వే నంబర్‌లోని అసైన్డ్ భూములు, వాటిలో రైతులు నిర్మించుకున్న ఇళ్ల వివరాలను సేకరించి పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు రైతులతో మాట్లాడి భూములకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతులు సహకరించాలని, భూములు కోల్పోయే వారికి నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
సాగులో ఉన్న ప్రతి రైతుకు పరిహారం ఇవ్వాలి
అనంతరం రైతులు మాట్లాడుతూ పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటున్న రైతులందరినీ గుర్తించి పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాలు లేవని, అలాంటి వారిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకొని నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అనిత, టీజీఐఐసీ అధికారులు శేషాద్రిరావు, తహసీల్దార్ కిషన్, ఆర్‌ఐ నవీన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, సర్పంచ్ మాణిక్య నాయక్, రైతులు జుక్యా నాయక్, వెంకట్ నాయక్, మంగ్యా నాయక్, రామ్‌సింగ్, వసంత్ నాయక్, సాల్య నాయక్, సొంకిబాయి, బామినిబాయి, కేళిబాయి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.