ఓట్ల తొలగింపుపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమా?
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సంఘం అధికారాలను తమ జేబు సంస్థలా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు పూర్తిగా భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే తామే వ్యవస్థలో పేర్లను చేర్పిస్తామని చెప్పడం ఏమిటని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎన్నికల సంఘం అధికారులుగా వ్యవహరించాలనుకుంటున్నారా అని నిలదీశారు. ఓటు హక్కు విషయంలో రాజకీయాలకు తావులేకుండా అర్హులైన ప్రతి పౌరుడి హక్కును కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదని అన్నారు. ఓట్లు తొలగించబడిన బాధితులను తీసుకువచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది కేవలం ఆరోపణలకే పరిమితమైన వ్యవహారం కాదని, తమ వద్ద ఉన్న ఆధారాలను చూపిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఏసీ గదుల్లో కూర్చొని సవాళ్లు విసరడం కాకుండా, ఏయే బూత్‌లు, వార్డుల్లో ఓట్లు తొలగించబడ్డాయో అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్ విసిరారు. ఓటర్ల జాబితా సవరణల్లో ఫామ్-6, ఫామ్-7 దరఖాస్తుల వినియోగంపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఫామ్-7 ద్వారా ఓట్ల తొలగింపునకు ఫిర్యాదులు చేశారా లేదా అన్న అంశంపై రామచంద్రరావు స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు.
ఓటర్ల జాబితా సవరణల్లో పారదర్శకతను నిర్ధారించి, ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం కలిగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై తలెత్తిన అనుమానాలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కుపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ పేర్లను తెరపైకి తెచ్చి సమస్యను మతపరమైన కోణంలోకి మళ్లించడం బీజేపీ రాజకీయ వ్యూహమని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఓటు హక్కు ఏ ఒక్క మతానికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, అది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.