వృద్ధురాలికి విజయవంతంగా రెండు భుజాల మార్పిడి శస్త్రచికిత్స
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : దీర్ఘకాలిక భుజాల నొప్పి, చేతులు పైకి ఎత్తలేక రోజువారీ పనులకు తీవ్ర ఇబ్బంది పడుతున్న 73 ఏళ్ల వృద్ధురాలికి నెల్లూరు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు దశలవారీగా రెండు భుజాలకు ‘రివర్స్ షోల్డర్ రీప్లేస్‌మెంట్’ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆమె వయస్సు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టారు. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం మొదట 2025 ఫిబ్రవరిలో ఎడమ భుజానికి శస్త్రచికిత్స నిర్వహించగా, రోగి పూర్తిగా కోలుకున్న అనంతరం 2026 సెప్టెంబర్‌లో కుడి భుజానికి రెండో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.
ఎముకల నిర్మాణాన్ని సూక్ష్మంగా అంచనా వేసేందుకు సీటీ స్కాన్ ఆధారిత అత్యాధునిక '3డి ప్రీ-ఆపరేటివ్ ప్లానింగ్' టెక్నాలజీని ఉపయోగించి, రోగి శరీర తీరుకు అనుగుణంగా ఇంప్లాంట్లను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ చికిత్స అనంతరం నొప్పి పూర్తిగా తగ్గి భుజాల కదలికలు మెరుగుపడటంతో, ఆమె ప్రస్తుతం స్వతంత్రంగా తన పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ మధన్మోహన్ రెడ్డి, డాక్టర్ కార్తీక్ రెడ్డి పమ్మి, డాక్టర్ ప్రవీణ్ జె, డాక్టర్ శ్రీనివాస్ ల బృందాన్ని ఆసుపత్రి యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అభినందించారు.