నారాయణరావుపేట పంచాయతీ అక్రమాలపై విచారణకు డిమాండ్. జిల్లా కలెక్టర్, డిపిఓకు ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఫిర్యాదు.
నారాయణరావుపేట పంచాయతీ అక్రమాలపై క్షేత్రస్థాయి విచారణకు డిమాండ్.
* జిల్లా కలెక్టర్, డిపిఓకు ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఫిర్యాదు.
* 24 చెక్కుల్లో 22 చెక్కులకు నా సంతకం లేదు: ఉప సర్పంచ్ నూప రాధ ఆరోపణ.
* పంచాయతీ వివాదంపై ముందే ప్రచురించిన 'సూర్య' దినపత్రిక.
దుమ్ముగూడెం,సూర్య (మేజర్ న్యూస్)::
దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట గ్రామ పంచాయతీ వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. సర్పంచ్ సాగిస్తున్న నిధుల దుర్వినియోగం, అక్రమాలపై ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయాలపై తాజాగా పాలకవర్గ సభ్యులే నేరుగా రంగాంలోకి దిగడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. సర్పంచ్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉప సర్పంచ్,వార్డు సభ్యులు మరియు గ్రామస్థులు కలసి సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్‌కు 'ప్రజావాణి' కార్యక్రమంలో అధికారికంగా వినతిపత్రం అందజేశారు.
*అవినీతి తీగ లాగితే.. అక్రమాల డొంక కదిలింది!*
గతంలో నారాయణరావుపేట పంచాయతీ పాలనలో జరుగుతున్న అవకతవకలపై 'సూర్య' దినపత్రికలో కతనం రావడంతో అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న తరుణంలో పాలకవర్గ సభ్యులే నేరుగా కలెక్టరేట్‌కు రావడం గమనార్హం.పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఏకంగా 24 చెక్కులలో 22 చెక్కులను ఉప సర్పంచ్‌కు కనీస సమాచారం లేకుండా సంతకం కూడా లేకుండా డ్రా చేసుకున్నారని పాలకవర్గం ఆరోపించింది.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నూప రాధ మాట్లాడుతూ..పాఠశాల పెయింటింగ్ పనులకు సంబంధించి రూ.15 వేలు, గ్రావెల్ రోడ్డు పనులకు రూ. లక్షన్నర బిల్లులకు తప్ప నేను మిగతా ఏ చెక్కుపైనా సంతకం చేయలేదు.నా సంతకం లేకుండానే మిగతా చెక్కులను అక్రమంగా డ్రా చేశారు.నేను పదవిలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నా ముద్ర (మోర్ స్టాంప్)ను కూడా అందజేయకపోవడం ఏంటో అర్థం కావడం లేదు.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
*ఏకపక్ష నిర్ణయాలు – నిధుల మళ్లింపు:*
గ్రామంలో ఎలాంటి గ్రామసభలు నిర్వహించకుండా పాలకవర్గం నుంచి ఎటువంటి ఆమోద తీర్మానాలు లేకుండానే సర్పంచ్ ఏకపక్షంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. పంచాయతీ రికార్డులను, నిధుల లెక్కలను వార్డు సభ్యులకు చూపించకుండా దాచిపెడుతున్నారని ప్రభుత్వ సొమ్మును స్వప్రయోజనాలకు వాడుకుంటూ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచ్ సాగిస్తున్న ఈ వ్యవహారం పై తక్షణమే క్షేత్రస్థాయి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ మేరకు సమర్పించిన వినతిపత్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం డిపిఓ కార్యాలయ అధికారులు స్వీకరించి రసీదును జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూప రాధ, వార్డు సభ్యులు సీతమ్మ, ముగరాజు,శ్యామల, కొమరం జంపన్న,ఉబ్బ నాగమణి సర్పంచ్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపారు.
సూర్య రిపోర్టర్ దుమ్ముగూడెం.. సుమన్