రైతుల సొమ్ముతో కట్టిన ఫ్యాక్టరీలను రైతులను అడక్కుండా అమ్మకమా?!
ఇది కో-ఆపరేటివ్ చట్టాలకు విరుద్ధం.. వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయవాడలో శోభనాద్రీశ్వరరావుతో సమావేశమైన రైతు సంఘం నేతలు
ఎస్.రాయవరం, అక్టోబర్ 5, మేజర్ న్యూస్:
రాష్ట్రంలోని కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీల భూములు, ఆస్తులను ఏపీఐఐసీకి అమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 250ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం విజయవాడలో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయకర్త వడ్డే శోభనాద్రీశ్వరరావును రైతు సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు స్వయంగా కలిసి, ప్రత్యేకించి సమావేశమై చర్చించారు. ఈ కీలక సమావేశం వివరాలను రైతు సంఘం నేతలు సోమవారం రాత్రి పత్రికల వారికి వివరిస్తూ...
రైతుల అభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వ నిర్ణయమా!
ఈ విషయమై వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, రైతుల షేర్ ధనంతో, కష్టార్జితంతో ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీలను రైతులతో మహాజన సభ జరపకుండా, రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా అమ్మడానికి కో-ఆపరేటివ్ చట్టాలు అంగీకరించవని తెలిపారు. రైతులు తమ ఆస్తులైన షుగర్ ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని సైతం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రైతులందరితో త్వరలోనే సమావేశాలు నిర్వహించే దిశగా అడుగులు పడే అవకాశంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇందుకోసం కీలక నిర్ణయమే తీసుకునే అవకాశం కనిపిస్తోంది.