రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్
4.50 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
మార్కాపురం మేజర్ న్యూస్
రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని కంభం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.20 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.4.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్‌కుమార్ మీనా ఆదేశాల మేరకు, మార్కాపురం డీఎస్పీ ఎన్.సత్యనారాయణ పర్యవేక్షణలో కంభం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. కంభం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 114/2026, సెక్షన్ 318(4) బీఎన్‌ఎస్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
రైల్వే ఇన్‌స్పెక్టర్‌నంటూ పరిచయం
పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన చెరుకూరి శ్రీను, తండ్రి వెంకట్రావు, తాను రైల్వే శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకునేవాడు. రైల్వే శాఖలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, రాజకీయంగా పలుకుబడి ఉందని నమ్మించేవాడు. కంభం, మార్కాపురం రైల్వే స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు ఆశ చూపి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జిరాక్స్ దుకాణం ముసుగులో..
నిందితుడు సుమారు మూడు నెలల క్రితం కంభం పట్టణానికి వచ్చి వాసవి స్కూల్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసించాడు. రావిపాడు రోడ్డులో ‘శ్రీనివాస డిజిటల్ జిరాక్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్’ నిర్వహిస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ పరిచయాలను ఉపయోగించుకుని తాను రైల్వే శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నానని ప్రచారం చేస్తూ పలువురిని ఉద్యోగాల పేరుతో నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.
పెద్దనల్లకాలువ గ్రామానికి చెందిన పిళ్లి చరణ్‌రాజుకు రైల్వేలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.66,500 వసూలు చేసినట్లు కేసు దర్యాప్తులో తేలింది. కడప జిల్లా పులివెందులకు చెందిన కొప్పుల భరత్‌కుమార్‌రెడ్డి వద్ద రూ.4.88 లక్షలు, ఇంకొల్లు ప్రాంతానికి చెందిన శాలేము రాజు వద్ద రూ.6.28 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
గతంలోనూ కేసులు
నిందితుడు గతంలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లినట్లు వెల్లడించారు. నల్గొండ జైలు నుంచి విడుదలైన అనంతరం తిరిగి అదే తరహా మోసాలకు పాల్పడుతూ కంభం ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగించినట్లు దర్యాప్తులో తేలింది.
రూ.4.50 లక్షల సొత్తు స్వాధీనం
కేసు నమోదు అనంతరం కంభం పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచి ఆచూకీ గుర్తించారు. ఈ క్రమంలో మే 4న ఉదయం 10 గంటల సమయంలో కంభంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.3.20 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
డబ్బులు చెల్లించొద్దు
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు అధికారిక నోటిఫికేషన్, నియామక ప్రక్రియ, మెరిట్, నిబంధనల ప్రకారమే జరుగుతాయని పోలీసులు హెచ్చరించారు. మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, మోసపూరిత హామీలు ఇచ్చినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన కంభం సీఐ కె.మల్లికార్జున, ఎస్‌ఐ ఎ.శివకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రంగస్వామి, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మనాయుడు, హోంగార్డు గురుస్వామిని డీఎస్పీ ఎన్.సత్యనారాయణ అభినందించారు.